శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (09:31 IST)

భద్రతా మండలిలో కాశ్మీర్ అంశంపై నేడు రహస్య చర్చ

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం శుక్రవారం రహస్య అజెండాగా రానుంది. చైనా విజ్ఞప్తి మేరకు కాశ్మీర్ అంశంపై భద్రతా మండలి రహస్యంగా చర్చించనుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన 370వ అధికరణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 
 
దీనిపై చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేయాలని ఐరాస భద్రతామండలిని కోరింది. ఈ మేరకు భద్రతామండలి అధ్యక్షురాలు జువన్నా రోయెంకాకు పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ గతవారం లేఖరాశారు. పాక్ అభ్యర్థనకు దాని మిత్రదేశం చైనా మద్దతు పలికింది. కాశ్మీర్‌పై ఐరాస భద్రతామండలిలో రహస్యంగా చర్చించాలని చైనా కూడా అధికారికంగా విజ్ఞప్తి చేసింది. భారత్ మాత్రం కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు తమ అంతర్గత అంశం అని అంతర్జాతీయ సమాజానికి తేల్చి చెప్పింది. పాకిస్థాన్ కూడా వాస్తవాలను అంగీకరించాలని హితవు పలికింది. 
 
ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం అంతర్గత సమావేశం జరుపాలని నిర్ణయించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని, కాశ్మీర్ అంశాన్ని ఎజెండాలో చేర్చారని పలువురు దౌత్యవేత్తలు తెలిపారు. కశ్మీర్‌పై చర్చించడం అత్యంత అరుదైన సందర్భమన్నారు. ఈ సమావేశాన్ని పూర్తిస్థాయి భద్రతామండలి సమావేశంగా పరిగణించకున్నా.. అంతర్గత సంప్రదింపులు (క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్స్) జరుగుతాయని, ఇటీవలి కాలంలో ఇటువంటివి సాధారణంగా మారాయన్నారు. కాగా, కాశ్మీర్‌పై 1965లో చివరిసారిగా ఐరాస భద్రతామండలి పూర్తిస్థాయి సమావేశం జరిగింది. 
 
ఇదే అంశంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ స్పందిస్తూ కాశ్మీర్‌పై భారత్, పాకిస్థాన్ నిగ్రహం పాటించాలని ఇప్పటికే సూచించారు. దీనిపై మూడోపక్షం జోక్యానికి అవకాశం లేదని, సిమ్లా ఒప్పందం ప్రాతిపదికన ముదుకెళ్లాలని సూచించారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ స్పందిస్తూ కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతామండలి సమావేశమైతే.. నాలుగు దశాబ్దాల తర్వాత తాము దౌత్యపరంగా సాధించిన గొప్ప విజయమవుతుందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు సోమవారం చైనాలో పర్యటించిన భారత్ విదేశాంగమంత్రి జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో జరిగిన సమావేశంలో కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేయడం వల్ల సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)పై ప్రభావం ఉండబోదన్నారు.