శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (19:47 IST)

కశ్మీర్: పాకిస్తాన్‌ అభ్యర్థనను అంతర్జాతీయ సమాజం ఎందుకు వినడం లేదు...

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించింది. ఎన్నో ఏళ్లుగా సంక్షోభంతో రగులుతున్న కశ్మీర్‌ను ఈ నిర్ణయంతో అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంటోంది. కశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 పెద్ద అవరోధంగా మారిందంటూ భారత హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు. అయితే, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపును పాకిస్తాన్ సహజంగానే తప్పుపట్టింది.

 
భారత్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. లాహోర్, అటారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి సహా వీలున్న అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామని, భారత్ ‌తీరును ఎండగడతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

 
భారత్ మాత్రం కశ్మీర్ అంశం ద్వైపాక్షికమని, ఈ విషయంలో మూడో పక్షం కలుగజేసుకోవడం అనసవరమని నొక్కి వక్కాణిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ అభ్యర్థనను ప్రపంచ దేశాలు వింటాయా? ఐరాస భద్రత మండలి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా? విచిత్రమేంటంటే కశ్మీర్ విషయంపై ఐరాసను మొట్టమొదట ఆశ్రయించిన దేశం భారతే.

 
1948లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐరాస దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడే కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఐరాస మధ్యవర్తిత్వం కారణంగా కశ్మీర్‌లోని కొంత ప్రాంతం భారత్‌లో, మరికొంత ప్రాంతం పాక్ నియంత్రణలో అలాగే కొనసాగాయి. ఈ చర్యను చారిత్రక తప్పిదంగా భారతీయ రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తుంటారు.

 
కశ్మీర్ అంశంపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యురాలిగా ఉన్న రాధా కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''ఐరాసకు వెళ్ళడం పెద్ద పొరపాటు. ఐరాస అప్పుడప్పుడే ప్రారంభమైంది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల విషయంలో పెద్ద దేశాల ఒత్తిడికి అది తలొగ్గదని భావించడానికి లేదు'' అని ఆమె అన్నారు. అయితే, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణ విషయంలో ఐరాస కొన్ని షరతులు పెట్టింది. కశ్మీర్‌ను విడిచి పాక్ సైన్యం వెళ్లిపోవాలని, భారత్ కూడా వీలైనంత తక్కువ సైన్యాన్నే అక్కడ ఉంచాలని సూచించింది. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు.

 
కశ్మీర్ నుంచి పాక్ సైన్యం పూర్తి స్థాయిలో వెళ్లిపోలేదని చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణను భారత్ పక్కకుపెట్టింది. మరోవైపు అక్కడ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నసందేశాన్ని చాటింది. అయితే, భారత్ వాదనను ఐరాస, పాకిస్తాన్ అంగీకరించలేదు. 1971లో భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. ఆ మరుసటి ఏడాది భారత్, పాక్‌ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు ఇందులో అంగీకరించుకున్నాయి.

 
అయితే, ఆ తర్వాత కూడా పాకిస్తాన్ కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించడంతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా కశ్మీర్ విషయంలో భారత్‌, పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కశ్మీర్ అంశం గురించి లోతుగా పరిశీలించిన పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ హారూన్ రషీద్ "భారతదేశమే దీనిని అంతర్జాతీయ అంశంగా మార్చిందని, ఐక్యరాజ్యసమితి వరకూ తీసుకొచ్చిందని పాకిస్తాన్ అంటోంది. నెహ్రూ తర్వాత నుంచి భారత్ విధానం ఎందుకు మారింది అని అంటోందని" చెప్పారు.

 
"పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినపుడు చాలా సంతోషంగా వచ్చారు. ట్రంప్ ఆయనలో మధ్యవర్తిత్వం ఆశలు రేపారు. ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి కశ్మీర్ అంశాన్ని పరిష్కరిస్తే, ఆ ప్రాంతంలోని పది లక్షల మందికి ప్రయోజనం లభిస్తుందని ఆయన ట్రంప్ ముందే చెప్పారు" అన్నారు రషీద్

 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో మధ్యవర్తిత్వం గురించి మాట్లాడారనే ట్రంప్ వాదనను భారత్ కొట్టిపారేసింది. చైనా నుంచి మధ్యవర్తిత్వం చేస్తామనే సూచనతో కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చేయాలనే పాకిస్తాన్ ఉద్దేశానికి బలం చేకూరింది.

 
పాకిస్తాన్ ఎలా స్పందిస్తోంది...
పాకిస్తాన్ తీరుపై ప్రశ్నలు కూడా వస్తున్నాయి. "ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఒక పరిష్కారం గురించి మాట్లాడారు. కశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించాలని, బహుశా అదే దానికి పరిష్కారమని చెప్పారు" అని హారూన్ రషీద్ చెప్పారు. "ఇమ్రాన్ ఖాన్ అదే మూడు భాగాల పరిష్కారాన్ని అమలు చేస్తున్నారా, లేక అమెరికాలో ఏదైనా మాట ఇచ్చివచ్చారా? ఆయన అలా ప్రకటించగానే, కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజిస్తున్నాం అని భారత్ చెప్పింది. ఇక మూడో భాగం పాకిస్తాన్ దగ్గరుంది. వాళ్లు కావాలనుకుంటే అలాగే పరిష్కరించుకోవచ్చు".

 
"ఆర్టికల్ 370 పై నిర్ణయం భారత్ తీసుకున్నప్పుడు భారత్‌పై ఒత్తిడి పెంచగలిగే అమెరికా, చైనా లాంటి దేశాలతో మాట్లాడకుండా టర్కీ, మలేసియా నేతలను ఇమ్రాన్ ఎందుకు సంప్రదించారని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారని" హారూన్ రషీద్ అన్నారు. మరోవైపు, కశ్మీర్‌లో మొదటి నుంచే చాలా పక్షాలు ఉన్నాయి. అందుకే ఈ అంశం ఇంత సంక్లిష్టంగా మారింది అంటారు రాధాకుమార్.

 
"రెండు వైపులా సమస్యలున్నాయి. ఒకటి భారత్-పాకిస్తాన్. ఇంకొకటి విభజిత కశ్మీర్. విభజిత కశ్మీర్‌లో చైనా కూడా వస్తుంది. ఇదంతా చూస్తే మనకు చాలామంది హక్కుదారులు, ఆటను చెడగొట్టేవాళ్లు కనిపిస్తారు. ఇందులో ఈ ఒక్క దేశమే కాదు, చాలా దేశాలు ఉంటాయి. అప్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన ఉన్నప్పుడు చాలామంది అఫ్గాన్లు కూడా ఇక్కడికి వచ్చారు" అని ఆమె చెప్పారు.

 
"కానీ, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపించచ్చు. కానీ ఈ అంశంపై దానికి ఐక్యరాజ్యసమితి లేదా అగ్రదేశాల మద్దతు లభించడం కష్టం. గత 50 ఏళ్లలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితి వచ్చినపుడు మాత్రమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జోక్యం చేసుకుంది అనే విషయాన్ని అది గుర్తు చేస్తుంది" అన్నారు రాధాకుమార్.

 
"ప్రపంచంలోని అగ్రదేశాలు దీనిపై పెద్దగా ఒత్తిడి తీసుకురాలేవు అని నాకు అనిపిస్తోంది. సరిగా జోక్యం చేసుకోవాలంటే, దానితోపాటు ఆర్థిక, సైనిక ఫలితాలను కూడా చూడాల్సుంటుంది. బెదిరించాలి, మేం వీటిని ఉపయోగిస్తామని సన్నాహాలు కూడా చేయాలి. అమెరికా, చైనాలు సైనిక, ఆర్థిక జోక్యం చేసుకుంటాయని నాకైతే అనిపించడం లేదు" అన్నారు.

 
అటు హారూన్ రషీద్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. "ప్రపంచ దేశాలు దీనిని వివాదాస్పద అంశంగా కచ్చితంగా అనుకుంటాయి. కానీ, దీనిని అంతర్జాతీయ అంశంగా చేసే ప్రయత్నాల్లో పాకిస్తాన్ పెద్దగా విజయం సాధించలేదు" అన్నారు. "పాకిస్తాన్ ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. గత 10, 15 ఏళ్లలో ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించింది. దానివల్ల ఏ ఫలితం ఉండదని నాకనిపిస్తోంది. అది మానవ హక్కుల అంశాన్ని లేవనెత్తుతుంది. దీనిపై మానవ హక్కుల సంస్థలు మాట్లాడుతాయి. కానీ, వేరే ఏ దేశమూ పెదవి విప్పదు. 

 
ప్రతి ఒక్కరికీ ఆర్థిక, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. వారు దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రతి దేశం దీనిని ఒక అంశంగా భావిస్తుంది. ఇది ఒక వివాదాస్పద ప్రాంతమని, దీనిని ఇంకా పరిష్కరించలేదని అనుకుంటుంటాయి" అంటారు రషీద్. దీనికి పరిష్కారం ఎప్పుడు, ఎలా? అనే ప్రశ్నకు, సమాధానం ఇప్పుడప్పుడే లభించేలా కనిపించడం లేదు.