జమ్మూ కాశ్మీర్‌లో జాతీయ జెండా: లడఖ్‌లో ధోనీ పతాకావిష్కరణ (Video)
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్‌లో ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగురనుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లడఖ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండడం విశేషం. ఇందులో భాగంగా శనివారం ధోని లేహ్ నుంచి లడఖ్‌కు బయల్దేరాడు. అయితే, లడఖ్‌లో ధోనీ జెండా ఎగురువేసే వేదికను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
కాగా ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ భారత ఆర్మీలో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న 106 టిఎ బెటాలియన్ (పారా)లో విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని కశ్మీర్‌లో పారామిలటరీ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులతో చాలా చక్కగా కలిసిపోతున్నాడు.
ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. తన విధుల్లో భాగంగా ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లడఖ్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జమ్మూ కాశ్మీర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అకాడమీ ద్వారా అక్కడి యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ధోనీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖతో ధోనీ మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.