శృంగార సమయంలో మహిళల్లో భావప్రాప్తి కలిగిందో లేదో చెప్పగలిగే టెక్నాలజీ.. వివాదంలో చిక్కుకున్న సంస్థ
మహిళల్లో భావప్రాప్తిని గుర్తించేందుకు అల్గారిథం రూపొందించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుండడంతో దానిని తయారు చేస్తున్న సదరు సంస్థ తాము చేస్తున్న పనిని సమర్థించుకుంది. శృంగార సమయంలో ‘మహిళల 86 శాతం’ భావప్రాప్తిని తమ అల్గారిథం ధ్రువీకరించగలదని సైప్రస్‌లో ఉన్న రెలీడా లిమిటెడ్ సంస్థ చెప్పింది.
సంస్థ తాము రూపొందించిన ఒక ప్రెజంటేషన్‌కు సంబంధించిన కొన్ని స్లైడ్స్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వాటిని కొన్ని వేలసార్లు రీట్వీట్ చేశారు. దీని ద్వారా సెక్స్ టెక్ ఉత్పత్తులు తయారు చేసేవారికి తాము సాయం చేయాలని అనుకున్నామని, తమ ప్రయత్నాన్ని వక్రీకరిస్తున్నారని సంస్థ చెప్పింది. లెలో అనే సెక్స్ టాయ్ సంస్థ మేనేజర్ స్టూ నూజెంట్ ట్విటర్‌లో ఈ ప్రెజెంటేషన్ పోస్ట్ చేశారు.
ఆ స్లైడ్స్ బీబీసీ పరిశీలించింది. ఒక మహిళకు భావప్రాప్తి కలిగిందనే విషయాన్ని తెలుసుకోడానికి విశ్వసనీయమైన పద్ధతి ఏదీ లేదని అవి చెబుతున్నాయి. అందులో భావప్రాప్తి పొందినట్లుగా నటించిన మహిళలకు సంబంధించిన గణాంకాలు కూడా ఇచ్చారు. తమ అల్గారిథంను ఇంకా అభివృద్ధి చేస్తున్నామని, తమ ప్రెజెంటేషన్ ప్రచురించడానికి ఉద్దేశించింది కాదని రెలిడా సంస్థ చెప్పింది.
హృదయ స్పందన ఆధారంగా...
ఇంతకు ముందు హృదయ స్పందనలో మార్పులపై జరిగిన పరిశోధనల ఆధారంగా అది ఈ అల్గారిథం రూపొందించింది. “క్లైమాక్స్’కు చేరుకున్నప్పుడు హృదయ స్పందనలో ఒక నిర్దిష్ట పాటర్న్ ద్వారా భావప్రాప్తిని గుర్తించవచ్చు. అల్గారిథం ఇంకా పూర్తి కానప్పటికీ, ఒక మహిళ మరో మహిళ క్షేమం కోసం దానిని సృష్టించారు అని సంస్థ బీబీసీకి పంపిన ఈమెయిల్లో చెప్పింది.
“మేం ఈ అల్గారిథంను నేరుగా మహిళలకు లేదా పురుషులకు అమ్మాలని అసలు అనుకోవడం లేదు. నిజానికి ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమాచారం మహిళలపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తుంది” అని తెలిపింది. సంస్థ నూజెంట్ చేసిన ట్వీట్‌ను ‘అనైతికం’గా వర్ణించింది. ఆయన మాత్రం లింకెడిన్లో ఉన్న కొన్ని స్లైడ్స్ అందుబాటులో ఉండడంతో వాటిని పెట్టానని చెప్పాడు.
“సూటిగా చెప్పాలంటే, మా డిజైన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయో, లేదో నిర్ణయించడానికి మా దగ్గర ఇప్పటికే చాలా బలమైన, విశ్వసనీయమైన వ్యవస్థ ఉంది. వాటిని ఉపయోగించేవారిని అడిగి మేం దానిని రూపొందించాం” అని నూజెంట్ చెప్పారు. “ఏ కేసులో అయినా ‘భావప్రాప్తి’ అనేది ఒక సెక్స్ టాయ్ ద్వారా వచ్చే సంతోషాన్ని కొలవడానికి సరైన కొలమానం కాదు. మా అల్గారిథం పూర్తిగా సైన్స్ కోసమే” అని రెలీడా అంటోంది.
అయితే, నూజెంట్ మాత్రం తమకు ఎప్పుడూ రాని సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. “నిజానికి అది పొందిన(లేదా పొందుతున్న) వారు చెప్పినదానికి వ్యతిరేకంగా ‘భావప్రాప్తి’ని గుర్తించాలనే ఆలోచన ప్రమాదకరం” అని ఆయన చెప్పారు.