ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By ivr
Last Modified: గురువారం, 2 ఫిబ్రవరి 2017 (19:02 IST)

2017-18 కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి ప్రాధాన్యత ఎంత?

లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2017-18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా నూతన రాజధాని అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భూ సమీకరణలో

లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2017-18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా నూతన రాజధాని అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు మూలధన లాభాలపై ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపు ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిని నూతన రాజధాని అమరావతిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఇప్పటివరకు ఈ గ్రామాలకు చెందిన 25,614 మంది రైతులు 32,221.67 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. వారందరికీ ఈ మినహాయింపు వర్తిస్తుంది. రైతులు వ్యవసాయ భూములను అమ్మితే ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరంలేదు. అయితే రాజధాని నిర్మాణం జరుగుతున్నందున ఇక్కడి వ్యవసాయ భూములన్నీ పట్టణ పరిధిలోకి వచ్చాయి. అంతేకాకుండా ఆ భూములను లే-అవుట్లు, నివాస, వాణిజ్య ప్లాట్లుగా మార్చినందున వాటిని అమ్మితే భూమి విలువపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్(మూలధన లాభంపై పన్ను) ప్రభుత్వానికి చెల్లించాలి. సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రైతులు తమ పిల్లల పేరున రాయాలన్నా ఈ పన్ను చెల్లించాలి. ఇప్పుడు ఆ పన్ను చెల్లించవలసిన అవసరంలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన  2014 జూన్ 2వ తేదీ నుంచి భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. 
 
రైతులు ప్లాట్లు పొందిన ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు జరిగే మొదటి లావేదేవీకి మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. భూముల విలువ పెరిగిన నేపధ్యంలో ఈ మినహాయింపు వల్ల దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు రైతులు లబ్ధిపొందే అవకాశం ఉందని అంచనా. భూ సమీకరణ జరిగిన తీరును బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రశంసించారు. ఇదో వినూత్న పథకం. అదే రీతిలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.
 
ఇతర అంశాలను పరిశీలిస్తే, విజయవాడ నగర మెట్రో రైలుకు రూ.101 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాల ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుకు రూ.150 కోట్లు కేటాయించారు. ఏపీ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ట్రైబల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.50 కోట్లు, ఏపీ ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ మెంట్)కు రూ.40 కోట్లు, ఏపీ ఎస్ఐటీ(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.10 కోట్లు, ఏపీ ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కు రూ.50 కోట్లు, ఏపీ ఐఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి రూ.30 కోట్లు కేటాయించారు. 
 
విశాఖపట్నం పోర్టుకు రూ.15 కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా మునిసిపల్ అభివృద్ధి,  రోడ్డు సెక్టార్ వంటి ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించారు. రైల్వే బడ్జెట్  2016-17లో ఏపీకి 2,195.7 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.3,406 కోట్లు కేటాయించారు. 
 
ఇవే కాకుండా ఇతర పథకాలకు కేటాయించిన నిధులలో మన రాష్ట్రానికి వచ్చే వాట ద్వారా పలు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాలన్నింటికి పైపులైను ద్వారా నీరు సరఫరా చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. దీంతో రాష్ట్రంలో వేల గ్రామాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. 
 
ఆ గ్రామాల్లో కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తారు. బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినందున అవి  గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడతాయి. సీసీ రోడ్లు, నీటి కుంటలు వంటి వాటి నిర్మాణానికి ఈ నిధులను వినియోగించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు రూ.4,034 కోట్లు కేటాయించారు. మన రాష్ట్రంలో 4వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పార్కులకు కూడా నిధులు కేటాయిస్తారు. సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త రోడ్లు నిర్మించడానికి నిధులు కేటాయించారు. మన రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉన్నందున ఇక్కడ రోడ్ల అభివృద్ధికి, కొత్త రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంది.  కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన వివిధ పన్నుల నుంచి రాష్ట్రానికి రూ.29,138.82 కోట్లు వచ్చాయి. మొత్తం కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 4.305 శాతంగా ఉంది.