ఏపీలో పెట్టుబడులకు రష్యా ఆసక్తి.. దేశంలోనే విశాఖ ఎంతో సుందరమైనది : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యాతో పాటు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో విశాఖపట్నంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యాతో పాటు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో విశాఖపట్నంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సు జరిగింది.
ఇందులోభాగంగా రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు అనే అంశంపై ఆయన పాల్గొని మాట్లాడుతూ... రక్షణ రంగంలో రష్యా చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు.
సాంకేతికత వినియోగంలో ఆ దేశం చాలా ముందుందని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులకు ముందుకొస్తే అన్ని విధాలా సాయాన్ని అందిస్తామని తెలిపారు. ఏపీలో రష్యా పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రం సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రమని ఆయన చెప్పారు. పర్యాటక అభివృద్ధికి కూడా రాష్ట్రం ఎంతో అనువైన ప్రాంతమని అన్నారు. దేశంలోనే విశాఖనగరం ఎంతో సుందరమైనదిగా ఆయన పేర్కొన్నారు.
అలాగే వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పట్టణీకరణ జరుగుతున్న క్రమంలో వాటికి తగ్గ మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రస్తుతం మన ముందున్న సవాల్ అని ఆయన అన్నారు. ప్రజలంతా పట్టణాలవైపు పరుగులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
వాటిని ఎదుర్కోవడమే అజెండాగా బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పట్టణాల్లో నివసిస్తోన్న ప్రజలు 32 శాతం మంది ఉన్నారన్నారు. దేశ జీడీపీలో అధికశాతం పట్టణాల నుంచే వస్తోందని, పట్టణాల నుంచి వచ్చే జీడీపీ శాతం 65గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌లో 84శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే, జీ-20లో బ్రిక్స్‌లోని 5 దేశాలే బలంగా ఉన్నాయన్నారు.