ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (11:55 IST)

ఏప్రిల్ ఒకటో తేదీ.. క్యాలెండర్‌లో తేదీనే కాదు... పెను మార్పులకు నాందికూడా..

2021 సంవత్సరంలో మూడు నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్ ఒకటో తేదీ మొదలైంది. అంటే కొత్త ఆర్థిక సంవతరం ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటి అంటే.. కేవలం క్యాలెండర్‌లో తేదీ మార్పు మాత్రమే కాదు... ఈ యేడాది ఏప్రిల్ ఒకటో నుంచి పెద్ద మార్పులకు అడుగు పడుతుంది. 
 
కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ ఒకటి నుంచే చాలా మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. పలు బ్యాంకుల పాస్ బుక్కులు పని చెయ్యవు.. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయ్‌.. అవేంటో ఓ సారి లుక్కేద్దాం..
 
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో అనేక ప్రతిపాదనలు అమలులోకి వచ్చేది ఈ తేదీ నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల రూపంలో సామాన్యులపై భారంపడే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఆదాయ పన్ను చట్టం కూడా అమల్లోకి రానుంది. 
 
ఇక సామాన్యులు కూడా ఎగిరిపోవాలని కలలుకనే విమాన ప్రయాణం కూడా మరింత ప్రియంగా మారిపోనుంది. కొత్త ఆర్థిక ఏడాది నుంచి కార్లు, బైక్‌ల ధరలు దూర తీరాలుకు చేరబోతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే టీవీల ధరలు పెరగనున్నాయి. 
 
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారిపై మరింత భారం పడనుంది. టీవీ, ఏసీలపై రూ.3 వేల నుంచి రూ.4 వేలు పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు ఏసీలు, ఫ్యాన్ల తయారీ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. 
 
ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోలేవు. ఎలాగంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఈపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. అయితే.. తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు.