రూ.7 నుంచి రూ.10 వరకు తగ్గనున్న పెట్రోల్ ధరలు!
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గనున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర కనిష్ట స్థాయి 50 డాలర్లకు చేరింది. ఇది బుధవారం మరో 2 డాలర్లు తగ్గి 47.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అలాగే, లండన్ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ కూడా 50 డాలర్ల స్థాయికి పడిపోయింది.
దీంతో గత రెండు రోజుల్లో ముడిచమురు ధర 10 శాతం తగ్గినట్లయింది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఈ పరిణామం బాగా కలిసివచ్చే అవకాశం. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ దఫా పెట్రోల్ ధరను లీటరుకు కనీసం రూ.7 నుంచి రూ.10 వరకూ, లీటరు డీజిల్ ధరపై రూ.6 మేరకు తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.