టర్కీ బంగారు ఆభరణాలను బహిష్కరించిన భారత వ్యాపారులు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తల నేపథ్య సమయంలో పాకిస్థాన్‌గా అండగా నిలిచిన టర్కీపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ టర్కీ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది టర్కీ దేశంలో పెను ప్రభావం చూపుతోంది.
తాజాగా లక్నోలోని బంగారు వ్యాపారులు టర్కీ డిజైన్లు, జ్యూవెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో అక్షయ తృతీయ రోజున అమ్మకాల చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్న టర్కీ ఆభరణాలు ఇపుడు ఏకంగా బహిష్కరణకు గురయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ఇక ఆ దేశ ఆభరణాలు కొనేవారే ఉండరని పలువురు జ్యూవెలరీ వ్యాపారులు విశ్వసిస్తున్నారు.
ఇదే విషయం అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆదిష్ జైన్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అక్షయ తృతీయ సందర్భంగా టర్కీ డిజైన్ ఆభరణాలకు భారీ గిరాకీ ఏర్పడిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ వ్యవహరించిన తీరుపై ఇకపై ఆ దేశ ఆభరణాలను దిగుమతి చేసుకోరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
టర్కీ నుంచి దిగుమతి చేసుకునేవాటిలో ప్రధానంగా నెక్లెస్‌లు, ఉంగరాలు, ఇయర్‌టాప్‌లు ఉంటాయని, తాము ప్రతిరోజూ విక్రయించే 20 నెక్లెస్‌లలో ఐదు నెక్లెస్‌లు టర్కీ నుంచి దిగుమతి చేసుకునేవే అని తెలిపారు. రోజువారీ విక్రయాల్లో ఆ దేశ డిజైన్ల వాటా 25 శాతం ఉండేదని వివరించారు.