శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (12:06 IST)

లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గించొచ్చు.. వెల్లడైన 'చిదంబరం' రహస్యం

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ రహస్యం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ఆయన చెప్పిన చిదంబర రహస్యం వల్ల ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.25 వర

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ రహస్యం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ఆయన చెప్పిన చిదంబర రహస్యం వల్ల ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.25 వరకు తగ్గించవచ్చట. ఇంతకీ ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం.
 
ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ రూ.82కి చేరింది. వాస్తవానికి ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. అప్పుడు కూడా కేంద్రం ధరలు తగ్గించలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించనప్పుడు కేంద్రం ఒక్కో లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.15 వసూలు చేసింది. దీనికి అదనంగా మరో రూ.10 పన్నుల రూపంలో వాత పెట్టింది. ఈ మొత్తం రూ.25. రెండేళ్ల పాటు దేశంలోని ప్రతి లీటర్ పెట్రోల్ నుంచి ఇలా రూ.25 వసూలు చేసిందని చిదంబరం ట్విట్ చేశారు. 
 
ఇప్పుడు కూడా కేంద్రం తలచుకుంటే.. ప్రజలపై ప్రేమ ఉంటే.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గించవచ్చని చిదంబరం సలహా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం అలా చేయటం లేదని.. 2, 3 రూపాయలు తగ్గిస్తూ వాహనదారులను మోసం చేస్తుందంటూ ట్విట్ చేశారు. ఇది కేంద్రానికి ఎంత మాత్రం భారం కాదని వివరించారు. ధర తగ్గినప్పుడు వసూలు చేసిన రూ.15 ఎటూ వాహనదారులకే తిరిగి ఇవ్వొచ్చు అని.. పన్నులు తగ్గించుకుంటే మరో రూ.10 ధర తగ్గుతుందని వెల్లడించారు. చిదంబరం ట్విట్‌తో రహస్యం వీడిందని.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు తగ్గించాలని చమురు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.