శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (11:06 IST)

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ దూకుడు... భారీగా రిజిస్ట్రేషన్లు

apartments
హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఐదేళ్లు తెలంగాణ రాజాధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(జనవరి-జూన్‌)లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2011 తర్వాత అంతకుమించి ఇళ్ల విక్రయాలు జరిగింది ఇప్పుడే. 2013 నుంచి ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆరునెలల్లో 4 శాతం ప్రియమయ్యాయి. 
 
దేశవ్యాప్తంగా 8 నగరాల్లో రికార్డుస్థాయిలో ఇళ్ల విక్రయాల్లో 60 శాతం వృద్ధి నమోదైంది. తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయిలో విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఐటీ రంగంపై కొవిడ్‌ ప్రభావం పెద్దగా లేకపోవడంతో హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్‌ కొనసాగుతోందని విశ్లేషించింది. ఇటీవల వరకు గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొంది. 
 
హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో గృహనిర్మాణ రంగ వాటా 62 శాతంగా ఉంది. కొత్తగా 21,356 ఇళ్లు నిర్మితమవుతున్నాయి. వార్షిక వృద్ధి 28 శాతంగా ఉంది. 2021 తొలి అర్థభాగంలో 16 లక్షల చ.అ. మేర కార్యాలయ భవనాల లీజింగ్‌ జరగ్గా.. 2022 ఇదే సమయంలో 32 లక్షల చ.అడుగులకు పెరిగింది. పూర్తైన నిర్మాణాలు 53 లక్షల చ.అ.కు చేరాయి. వార్షిక వృద్ధి 62 శాతంగా ఉంది. అద్దెలు 3 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది.