శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హోటల్ బ్రాండ్ ఏది?

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హోటల్ బ్రాండ్‌ ఏది అనే అంశంపై అంతర్జాతీయ బ్రాండ్‌ విలువ మదింపు సేవల సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌.. ‘హోటల్స్‌-50 2021’ పేరుతో ఓ సర్వే నిర్వహించి, ఫలితాలను వెల్లడించింది.
 
ఇందులో మన దేశానికి చెందిన టాటా గ్రూప్‌నకు చెందిన తాజ్‌ హోటళ్లకు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హోటల్‌ బ్రాండ్‌గా గౌరవం దక్కింది. టాటా గ్రూప్‌లోని ఆతిథ్య సేవల కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) ఈ తాజ్‌ హోటళ్లను నిర్వహిస్తోంది. 
 
అయితే, 'హోటల్స్‌-50 2021' పేరుతో ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన హోటల్‌ బ్రాండ్ల జాబితాను విడుదల చేసింది. వ్యాపారపరంగా ఎన్నో విజయాలు సాధించడంతోపాటు కరోనా సంక్షోభాన్ని సైతం తట్టుకొని నిలబడిగిన తాజ్‌ బ్రాండ్‌కు ఈ జాబితాలో అగ్రస్థానం లభించింది.
 
మార్కెటింగ్‌ ఖర్చు, వినియోగదారులతో అనుబంధం, సిబ్బంది సంతృప్తి, పేరు ప్రతిష్ఠలు తదితర అంశాల ఆధారంగా బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఆయా బ్రాండ్ల శక్తి, సామర్థ్యాలను లెక్కిస్తుంది. ఈ కంపెనీ రూపొందించిన బ్రాండ్‌ సామర్థ్య సూచీలో తాజ్‌కు 100కు 89.3 పాయింట్లు లభించాయి. 
 
ఈ జాబితాలో తాజ్‌ తర్వాత ప్రీమియర్‌ ఇన్‌, మెలియా హోటల్స్‌ ఇంటర్నేషనల్‌, ఎన్‌హెచ్‌ హోటల్‌ గ్రూప్‌, షాంగ్రీ-లా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ టాప్‌-5 స్థానాల్లో నిలిచాయి.  అలాగే, ప్రపంచంలో అత్యంత విలువైన హోటల్‌ బ్రాండ్ల జాబితాలో హిల్టన్‌ అగ్రస్థానంలో నిలిచింది. హిల్టన్‌ ప్రధాన ప్రత్యర్థి బ్రాండ్‌ మారియట్‌ ర్యాంకింగ్‌ గతసారి 2వ స్థానంలో ఉండగా, ఈసారి 5వ స్థానానికి జారుకుంది. 
 
హయత్‌ హోటల్స్‌ బ్రాండ్‌ రెండో స్థానానికి ఎగబాకగా.. హాలీడే ఇన్‌ మూడో స్థానం దక్కించుకుంది. హాంప్టన్‌ బ్రాండ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచంలోని అత్యంత విలువైన హోటల్‌ బ్రాండ్ల జాబితాలో తాజ్‌కు స్థానం లభించడం 2016 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.