నేడు కార్మిక సమ్మె .. దేశ వ్యాప్తంగా వివిధ సేవలు బంద్
సమ్మె సైరన్ మోగింది. పది జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రజారవాణా, టెలికం, బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. తమ 12 డిమాండ్లలో ప్రధానమైనవి రూ.
సమ్మె సైరన్ మోగింది. పది జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రజారవాణా, టెలికం, బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. తమ 12 డిమాండ్లలో ప్రధానమైనవి రూ.18 వేల కనీస వేతనం, ధరల పెరుగుదలను అరికట్టడం, నెలకు రూ.3 వేల కనీస పెన్షన్, పీఎస్‌యూల ప్రైవేటీకరణ ఆపాలి, సహజ వనరుల్ని కార్పొరేట్లకు దోచిపెట్టొద్దు, పెట్రోల్‌పై పన్నులు ఎత్తివేయాలి, ధరలను నియంత్రించాలి, కార్మికులందరికీ ఒకేరకమైన సామాజిక భద్రత, గ్రాట్యుటీ పెంచాలి. బోనస్‌పై పరిమితి ఎత్తివేయాలి వంటి పలు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి.
ఈ సమ్మెలో నౌకాశ్రయాలు, విమాన సర్వీసులు, రోడ్డు రవాణా, టెలికం, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించనున్నాయని సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.తివారీ తెలిపారు. అయితే, భారత రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు. ఏడో వేతన సంఘంలో రూ.18 వేలుగా నిర్ధారించిన కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న డిమాండ్‌పై అధ్యయనానికి కేంద్రం కమిటీ వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి చెందారు. వేతనసంఘంలో కేంద్రమే నిర్ణయించిన రూ.18 వేలు ఇతర కార్మికులకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణల పేరిట కార్మిక హక్కులను కాలరాస్తోందని, ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు విమర్శించారు. సంస్కరణల పేరిట 75 శాతం మంది కార్మికుల్ని చట్టాల పరిధి నుంచి తప్పించే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. మోడీ హయాంలో కీలక రంగాల్లో కేవలం 4 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.