శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (19:57 IST)

ఏపీలో వెయ్యిలోపు తగ్గిన పాజిటివ్ కేసులు - వైద్యుడు మరణిస్తే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కఠిన చర్యల ఫలితంగా ఈ కేసుల సంఖ్య వెయ్యికి కిందకు పడిపోయాయి. 
 
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏ జిల్లాలోనూ కొత్త కేసుల సంఖ్య 1000కి దాటలేదు. 
 
గడచిన 24 గంటల్లో ఏపీలో 87,756 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,549 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో నమోదైన 860 కేసులే అత్యధికం. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 619 పాజిటివ్ కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 182 కేసులు వెల్లడయ్యాయి.
 
అదేసమయంలో 10,114 మంది కరోనా నుంచి కోలుకోగా, 59 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 12 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,14,393 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,22,381 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 80,013 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,999కి చేరింది.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి ఏపీ ప్రభుత్వం పరిహారం నిర్ణయించింది. కరోనా విధులు నిర్వర్తిస్తూ వైద్యులు మరణిస్తే రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ మేరకు పరిహారాన్ని కేటగిరీలుగా విభజన చేసి ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం గరీబ్ కల్యాణ్ యోజనకు అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ విధుల్లో ఉన్నవారికే ఈ పరిహారం అని స్పష్టం చేసింది.