సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (14:13 IST)

కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామం ఎంత ఉండాలంటే?

కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం కొన్ని రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాను రెండు డోసులుగా వేసుకున్నట్టయితే ఈ వైరస్ బారినపడుకుండా రక్షించుకోవచ్చని వైద్యులు పదేపదే చెబుతున్నారు. అలాంటి టీకాల్లో ఒకటి కోవిషీల్డ్. 
 
ఈ టీకాను తొలి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోసుకు వేయించుకునేందుకు ఎంత విరామం ఉండాలన్నదానిపై పలు రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం తలెత్తుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. 
 
రెండో డోసును ఆరు నెలలలోపు తీసుకున్నా.. అది సమర్థంగానే పనిచేస్తుందని భరోసా ఇస్తున్నారు. కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పొడిగించింది. ఇదేసమయంలో బ్రిటన్‌ ప్రభుత్వం దీన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించింది. 
 
అయితే, భారత్‌ నుంచి వచ్చిన ‘బి.1.617’ రకం కరోనా వైరస్‌ తమ దేశంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీకా డోసుల మధ్య విరామాన్ని భారత్‌లో పెంచడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 
 
ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ దీనిపై స్పందించారు. మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసును ఇవ్వవచ్చు. ఆరు నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్‌ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుందన్నారు. అలాగే, మొదటి డోసు పొందిన నెలలోపు రెండో డోసును పొందినా.. టీకా రక్షణ సామర్థ్యమేమీ పెరగబోదని చెప్పారు. 
 
అయితే, కొవిషీల్డ్‌ రెండో డోసును.. మొదటి టీకా పొందిన మూడు నెలల తర్వాత ఇస్తే సమర్థంగా పనిచేస్తుందని ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.