బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2020 (13:31 IST)

90 లక్షలు దాటిన కరోనా కేసులు, 24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు, 584 మరణాలు

దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల మార్కును దాటేసింది. కేవలం 22 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. కేసుల పరంగా అమెరికా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది.
 
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన  24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే, క్రియాశీల కేసులు ఐదు శాతానికి దిగువన ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,43,794గా ఉండగా.. ఆ కేసుల రేటు 4.93 శాతానికి తగ్గింది. అలాగే రికవరీల సంఖ్య 84,28,409 (93.60 శాతం)గా ఉంది. 
 
ఈ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 584 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,32,162కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,83,397 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. మరోవైపు దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మాస్క్‌ ధరించనివారికి రూ.2,000 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.