మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (07:46 IST)

కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం...

కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేటు ఆస్పత్రి మ్యాక్స్‌లోని ఐసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా, ఆయనకు ప్లాస్మా థెరపీ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నప్పటికీ.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
గత ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌లతో కలిసి సత్యేంద్రజైన్‌ హాజరయ్యారు. కాగా సతేంద్రజైన్‌ త్వరగా కోలుకోవాలని అమిత్‌ షా ట్విటర్‌లో ఆకాంక్షించారు. 
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువవుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 13,586 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 336 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,80,532కి చేరినట్లు పేర్కొంది. ఒక్క మహారాష్ట్రలోనే 1.20 లక్షల పాజిటివ్‌ కేసులు దాటాయి.
 
దేశంలో ఇప్పటివరకు 12,573 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ, రికవరీ శాతం పెరుగుతోందని కేంద్రం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 53.79 శాతంగా ఉందని, గడిచిన 24 గంటల్లోనే 10,386 మంది కోలుకున్నారని తెలిపింది.