ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (08:59 IST)

టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కరోనా... వైకాపా పంతం నెరవేరినట్టేనా?

సంగం డైరీ అక్రమాల కేసులో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉంటున్న ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ధూళిపాళ్లతో ఆ సంస్థ మేజింగ్ డైరెక్టర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ తొలుత కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
జైలులో ఉన్న నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. 
 
స్వీకరించిన న్యాయస్థానం నరేంద్రకు ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆయనకు పరీక్షలు చేయించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.