కరోనా వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటేసిన భారత్
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అమెరికాను భారత్ దాటేసింది. ఇప్పటిదాకా మన దేశంలో 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 డోసుల టీకాలు వేయగా.. అమెరికాలో 32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసులు వేసినట్టు కేంద్రం వెల్లడించింది.
అయితే, వ్యాక్సినేషన్ క్రమంలో అమెరికా కన్నా తక్కువ టైంలోనే అన్ని డోసులు వేయడం విశేషం. అమెరికా అన్ని డోసులు వేయడానికి ఆరు నెలలు పడితే.. మనకు కేవలం ఐదు నెలల సమయం మాత్రం పట్టింది. అంటే అమెరికా కన్నా నెల ముందే ఆ మార్కును భారత్ అధిగమించింది.
అగ్రరాజ్యం అమెరికాలో డిసెంబర్ 14న కరోనా వ్యాక్సినేషన్ మొదలవగా.. భారత్‌లో జనవరి 16న ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితం 86 లక్షల డోసుల టీకాలేసి ఒక్కరోజులోనే అత్యధిక టీకాలేసిన రికార్డును సాధించింది.
అయితే, ఆ తర్వాత టీకా కార్యక్రమం మళ్లీ స్లో అయింది. ఆదివారం 13.9 లక్షల మందికి ఫస్ట్ డోస్ టీకా వేశారు. మరో 3.3 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. మొత్తంగా 17.21 లక్షల డోసుల వ్యాక్సిన్‌నే ప్రజలకు వేశారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటోందని, ఈ ఘనతలో భాగమైన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు వేయడమే తమ ప్రాధాన్యమని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సమాజం, ప్రభుత్వం అండతోనే ఈ ఘనత సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వివిధ దేశాలతో పోలుస్తూ వ్యాక్సినేషన్‌లో భారత్ ఏ స్థానంలో ఉందో గ్రాఫ్‌ను ట్వీట్ చేశారు.
జూన్ 21 నుంచి 45 ఏళ్ల లోపున్న వారికీ వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్రమే అందరికీ ఫ్రీగా టీకాలు వేస్తోంది. ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే పేదవారికి ఉచిత టీకా కోసం ఈవోచర్లనూ అందిస్తోంది.