శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (11:25 IST)

దేశంలో కరోనా కరాళ నృత్యం : 3417 మంది మృతి

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా అనేక మంది కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. 
 
గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వాటి ప్రకారం, నిన్న 3,00,732 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,604కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,417 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,18,959కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఆదివారం వరకు మొత్తం 29,16,47,037 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,04,698 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అదేవిధంగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్‌ బారినపడి మరో 49 మంది ప్రాణాలు వదిలారు. ఆదివారం ఒకే రోజు 58,742 మంది పరీక్షలు చేయగా.. 5,695 కేసులు వెలుగు చూశాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
మహమ్మారి నుంచి కొత్తగా 6,206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,352, మేడ్చల్‌ జిల్లాలో 427, రంగారెడ్డిలో 483 కరోనా కేసులు నమోదయ్యాయి.