శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (13:08 IST)

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఏ ఒక్కరూ మరణించలేదు : గాంధీ ఆస్పత్రి

కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్న ఏ ఒక్కరూ ప్రామాలు కోల్పోలేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోయేలా వుంది. దీనిపై డాక్టర్ రాజరావు స్పందిస్తూ, టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన 15 మందీ కోలుకున్నారని తెలిపారు. 
 
బాధితుల్లో కొందరికి వెంటిలేటర్లు అవసరమైనా ఒక్కరి ఆరోగ్యం కూడా విషమించలేదని, అందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఇది చక్కని ఉదాహరణ అని డాక్టర్ రాజారావు పేర్కొన్నారు.
 
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 650 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 400 మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నట్టు చెప్పారు. వీరిలో దాదాపు 15 శాతం మంది వరకు ఇంట్లో చికిత్స తీసుకుని ఆ తర్వాత ఇక్కడకు వచ్చినవారేనని, 75 శాతం ప్రైవేటు ఆసుపత్రులలో చేరి డబ్బులు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో ఆఖరి నిమిషంలో ఇక్కడకు వచ్చిన వారేనని తెలిపారు. 
 
చాలామంది భయంతో ముందే ఆసుపత్రులలో చేరడం వల్ల బెడ్స్ నిండిపోతున్నాయన్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్ రాజారావు తేల్చి చెప్పారు.