సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (16:57 IST)

పాకిస్థాన్ మీ శత్రువు కాదు... ఇంకా ఎంతకాలం రక్తం చిందించాలి : వసీం అక్రమ్

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించారు. భారత్, పాకిస్థాన్ ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమేనని, దీని నిర్మూలనకు ఇరు దేశాలు కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే ఉగ్రస్థావరాలపై గత మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
 
ఈ దాడులను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్ మరుసటి రోజు భారత ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులకు సిద్ధమవగా, భారత్ వాయుసేన అడ్డుకుంది. ఈ సందర్భంగా మిగ్-21 నడుపుతున్న అభినందన్ వర్ధమాన్ అనే భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కారు. 24 గంటల పాటు తమ వద్ద బందీగా ఉంచుకుని శుక్రవారం విడుదల చేసింది. 
 
ఈ పరిణామాలన్నింటిపై వసీం అక్రమ్ స్పందిస్తూ, భారత్, పాకిస్థాన్‌లకు ఉగ్రవాదమే ఉమ్మడి శత్రువన్నారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరారు. 
 
"భారత్‌కు భారమైన హృదయంతో చెబుతున్నా. పాకిస్థాన్ మీ శత్రువు కాదు. మీ శత్రువూ, మా శత్రువూ ఉగ్రవాదమే. దీనిపై రెండు దేశాలూ కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి రెండు దేశాలూ ఇంకా ఎంత రక్తం చిందిస్తాయి?" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.