ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 15 జూన్ 2021 (21:09 IST)

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌!

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అర్షద్‌ ఖాన్‌ ఆర్థిక ఇబ్బందులతో ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. పాకిస్థాన్‌ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ ఆఫ్‌ స్పిన్నర్‌.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. ఆఫ్‌ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగిన అర్షద్‌ ఖాన్‌.. రిటైర్‌మెంట్‌ అనంతరం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

కుటుంబాన్ని పోషించేందుకు ఆస్ట్రేలియా, సిడ్నీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే ఓ భారత నెటిజన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లగించాడు. తాను అర్షద్‌ ఖాన్‌ నడుపుతున్న క్యాబ్‌ ఎక్కానని తెలిపాడు. తమ మధ్య జరిగిన సంభాషణను కూడా పంచుకున్నాడు. 'మా క్యాబ్‌ డ్రైవర్‌గా అతన్ని చూశా. తనతో మాట్లాడుతుండగా.. తనది పాకిస్థాన్‌ అని, సిడ్నీలో ఉంటున్నానని తెలిపాడు.

అంతేకాదు, హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చానని, ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసిఎల్‌)లో భాగంగా లాహోర్‌ బాద్‌షాస్‌ జట్టు తరఫున ఆడానని తెలిపాడు. నేను వెంటనే అతన్ని పూర్తి పేరు అడిగి అతని ముఖం చూశాను. అతను పాక్‌ మాజీ క్రికెటర్‌ అని గుర్తు పట్టి షాకయ్యాను' అని సదరు నెటిజన్‌ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్‌లో మొత్తం 89 వికెట్లు తీసిన అర్షద్‌ ఖాన్‌.. టీమిండియా 2005 పాక్‌ పర్యటనలో అదరగొట్టాడు. దిగ్గజ ఆటగాళ్లు అయిన సెహ్వాగ్‌, సచిన్‌ వికెట్లను తీశాడు. ఇక తన చివరి టెస్ట్‌, వన్డేను కూడా అతను భారత్‌తోనే ఆడాడు.
 
కార్పెంటర్‌గా అవతారమెత్తిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జేవియర్‌ డోహెర్టీ కూడా ఆర్థిక పరిస్థితులతో కార్పెంటర్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 2001-02 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ అనంతరం ఆటకు గుడ్‌బై చెప్పాడు. మైకేల్‌ క్లార్క్‌ నేతృత్వంలో 2015 ప్రపంచకప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ జేవియర్‌ సభ్యుడు. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, 4 టెస్ట్‌లు ఆడిన డోహెర్టీ.. 55 వికెట్లు తీశాడు. చివరి సారిగా గతేడాది భారత్‌ వేదికగా జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడాడు.