బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (23:10 IST)

పట్టలేని కోపం కొంపముంచింది.. షకీబ్ అల్ హసన్‌పై నిషేధం వేటు..

Shakib Al Hasan
ఢాకా ప్రీమియర్ లీగ్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ వరుసగా 6, 4 బాదేశాడు. అప్పటికే తీవ్ర అసహనంలో ఉన్న షకీబ్ ఆ తర్వాత బంతికి ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ముష్ఫికర్ బ్యాట్‌కి తాకలేదు.. వికెట్లకి దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాడు. కోపంతో షకీబ్ వికెట్లని గట్టిగా కాలితో తన్ని అంపైర్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు.
 
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో వర్షం మొదలవడంతో ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 6 ఓవర్లు పూర్తి కావాల్సి ఉన్నందున.. ఆ ఆఖరి బంతిని వేయించాలని డిమాండ్ చేశాడు. కానీ అంపైర్లు తిరస్కరించారు. పట్టలేని కోపంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లని పీకేసి విసిరికొట్టాడు. ఇక ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత షకీబ్ అల్ హసన్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన తప్పు ఇకపై రిపీట్ చేయనని క్షమాపణలు చెప్పుకొచ్చారు. కానీ షకీబ్‌కు శిక్ష తప్పలేదు.
 
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అహంకార ప్రవర్తన కారణంగా మహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ నాలుగు మ్యా‌ల వరకూ నిషేధించబడ్డాడు. షకీబ్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అతడి జట్టు ఆడబోయే తర్వాతి మ్యాచ్ లలో ఆడలేడని నిర్వాహకులు తేల్చి చెప్పారు.