బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (18:55 IST)

కొత్త వివాదంలో షకీబ్ అల్ హసన్.. కత్తి పట్టుకుని హెచ్చరించాడు..

ఐసీసీ నిషేధం కారణంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గతేడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది అక్టోబరు 29తో అతనిపై ఉన్న నిషేదం తొలగింది. నిషేదం ఇలా ముగిసిందో లేదో మరో వివాదంలో చిక్కుకున్నాడు షకీబ్‌. కోల్ కతాలో ఇటీవల నిర్వహించిన కాళికా మాతా పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో ముస్లిం ఛాందసవాద సంస్థల నుంచి అతడికి బెదిరింపులు వచ్చాయి. 
 
ఓ వ్యక్తి ఏకంగా షకీబ్‌ను చంపేస్తానంటూ.. ఫేస్‌బుక్ లైవ్‌లో వార్నింగ్ ఇచ్చాడు. కత్తి పట్టుకుని మరీ షకీబ్‌ను హెచ్చరించాడు. ఢాకాకు వెళ్లి మరీ షకీబ్‌ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
గత గురువారం కోల్‌కతాకు వచ్చిన షకీబ్ ఓ కాళీమాత పూజ కార్యక్రమంలో పాల్గొన్నాడని, విగ్రహం ముందు ప్రార్థనలు కూడా చేశాడని ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం బంగ్లాకు చేరుకున్న షకీబ్.. తన పట్ల జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. అసలు తాను ఎలాంటి పూజలు నిర్వహించలేదని తెలిపాడు.
 
తాను హాజరైన ఇతర ప్రోగ్రామ్‌లో కూడా మత సంబంధమైన కార్యక్రమాలు లేవన్నాడు. అయితే పూజ కార్యక్రమానికి హాజరైన తనను దీపాలు వెలిగించమని నిర్వాహకులు కోరితే సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. ఇక ఓ అభిమాని ఫోన్ పగలగొట్టాననే ప్రచారంలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేశాడు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ప్రమాదవశాత్తు పగిలిపోయిందని, దానికి తాను క్షమాపణలు కూడా చెప్పానన్నాడు.