శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

Vijay Sethupathi
తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై కోలీవుడ్ అగ్రనటుడు విజయ్ సేతుపతి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు చూసి అనేక మంది నవ్వుకున్నారని, అయితే, తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. తనపై ఈ తరహా ఆరోపణలు చేసిన ఆ నటిపై తన టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. 
 
'నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. 'వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు హైలైట్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనీయండి' అని వారితో చెప్పాను. 
 
మేము ఆమెపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకూ దేనికీ భయపడలేదు. ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించవు" అని విజయ్ సేతుపతి వివరించారు.
 
కాగా, కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉందని, దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బందిపడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బంది పెట్టారని ఆరోపించింది. తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని తన పోస్టులో రాసుకొచ్చింది. అయితే ఆమె తన పోస్టును కొన్ని గంటల్లో తొలగించారు. 
 
అయితే, అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అయింది. దీంతో విజయ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ మరో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చింది. కోపంలో ఇలా చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు చెప్పింది.