గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్

దీపావళి నోములు ఎపుడు? లక్ష్మీపూజ ఎపుడు చేయాలి?

టపాకాయల పండుగ దీపావళి. చిన్నపిల్లలకు అతిపెద్ద పండుగ. చిన్నాపెద్దా ఎంతో ఆనందకరంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. అలాగే, మహిళలకు కూడా అతిముఖ్యమైన పండుగ. అయితే, ప్రతియేటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి రెండు రోజుల సంబురానికి సిద్ధమవ్వమంటున్నది. 
 
అమావాస్య తిథి శని, ఆదివారాల్లో పరివ్యాప్తమై ఉన్నందున రెండురోజుల పర్వంగా మారింది. దీంతో హారతులు, లక్ష్మీపూజలు శనివారం, నోములు ఆదివారంచేసుకోవాలని పంచాంగకర్తలు శాస్త్రప్రకారం నిర్ణయించారు. 
 
ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు శనివారం కలిసి వచ్చాయి. శనివారం చతుర్దశి తిథి పగలు 1.35 గంటల వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తున్నది. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి శనివారమే చేసుకోవాలి. అమావాస్య తిథి ఆదివారం ఉదయం 11.15 గంటల వరకు ఉంటుంది. ఫలితంగా దీపావళి సందర్భంగా నిర్వహించే వ్రతాలు ఆదివారం చేసుకోవాలని పంచాంగ కర్తలు సలహా ఇస్తున్నారు. 
 
ఇకపోతే, దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైనది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.