శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకునివున్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడివుంది. ఇది తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి దిత్వాహ్ అనే పేరు పెట్టినట్టు యెమన్ దేశం వెల్లడించింది. ఈ పేరును యెమెన్ దేశం నామకరణం చేసిందని అధికారులు తెలిపారు.
ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుఫాను కదులుతోందని పేర్కొన్నారు. దిత్వాహ్ తుపాను ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.