మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (23:05 IST)

ధోనీ రిటైర్మెంట్ : కలత చెందిన పాక్ వీరాభిమాని.. కీలక ప్రకటన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ నిర్ణయాన్ని అనేక మంది తాజా, మాజా క్రికెటర్లతో పాటు.. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్ వీరాభిమాని మహ్మద్ బషీర్ కూడా ఉన్నాడు. ఈయన ధోనీకి వీరాభిమాని. ధోనీ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాలకు తిరిగిన రికార్డు ఆయన సొంతం. అలాంటి బషీర్.. ధోనీ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనతో కలత చెందారు. దీంతో ఆయన కూడా కీలక ప్రకటన చేశారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో తాను కూడా ఇక నుంచి క్రికెట్ చూసేందుకు వెళ్లనని ప్రకటించాడు. 
 
'చాచా చికాగో'గా క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన మహ్మద్ బషీర్.. ధోనీకి బషీర్ వీరాభిమాని. ఎంతలా అంటే.. ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రతీ మ్యాచ్‌కు ఇతర దేశాలకు వెళ్లేవాడు. ధోనీనే స్వయంగా కొన్ని సందర్భాల్లో బషీర్‌కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేవాడు. చికాగోలో రెస్టారెంట్ నడుపుతూ జీవితం సాగిస్తున్న బషీర్ ధోనీని పలుమార్లు కలిశాడు. ధోనీతో కలిసి బషీర్ ఎన్నోసార్లు ఫొటోలు, సెల్ఫీలు దిగాడు.
 
'ధోనీ లవ్ యూ' అని ధోనీ చిత్రాలతో కూడిన షర్టు ధరించి స్టేడియంలో సందడి చేస్తూ కనిపించేవాడు. లైవ్ టెలికాస్ట్ కెమెరాలు కూడా ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేవి. భారత్‌కు చెందిన ధోనీని అంతలా అభిమానిస్తుండటంతో అతనిపై పాక్ అభిమానులు విమర్శలు కూడా చేశారు. కానీ.. బషీర్ అవేవీ పట్టించుకోలేదు. ధోనీపై అంతే అభిమానం చూపించేవాడు. 
 
తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ, పరిస్థితులు సాధారణ స్థితికొచ్చాక రాంచీలోని ఇంటికి వెళ్లి మరీ ధోనీని కలుస్తానని చెప్పాడు. రాంబాబును (మొహాలీకి చెందిన ధోనీ మరో వీరాభిమాని) కూడా తనతో రావాల్సిందిగా అడుగుతానని తెలిపాడు. ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూసేందుకు వెళ్లాలని ఉందని.. కానీ ప్రయాణాలపై నిబంధనలు, దానికితోడు తన ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో వెళ్లలేకపోతున్నట్లు బషీర్ చెప్పుకొచ్చాడు.