శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (15:22 IST)

చిత్తుగా ఓడిన భారత్ : ర్యాంకుల పట్టికలో రెండో స్థానానికి...

team india
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 147 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో తొలి సారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ దారుణ పరాభవంతో డబ్ల్యూటీసీ ర్యాంకుల పట్టికలో భారత్ స్థానం కూడా పడిపోయింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఈ ఓటమితో రెండో స్థానానికి దిగజారింది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరింది. భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగుకు చేరింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదులో కొనసాగుతోంది. 
 
భారత్ వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఇతర జట్లూ ముందుకు దూసుకురావడంతో భారత్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో భారత జట్టు తలపడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్‌. కనీసం 4 టెస్టుల్లో గెలిచి.. మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంటుంది. ఒక్కటి ఓడినా.. ఫైనల్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం.