గురువారం, 21 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (14:19 IST)

ముంబై టెస్టు - భారత ఆటగాళ్లు చెత్త ఆట .. స్వదేశంలో కివీస్ చేతిలో ఘోర పరాభవం

new zealand vs india
ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. పర్యాటక న్యూజిలాండ్ జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా సుధీర్ఘకాలం తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ ఓటమిని మూటగట్టుకుంది. 
 
కివీస్ నిర్దేసించిన 147 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత ఆటగాళ్ళు కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో కివీస్ జట్టు 25 పరుగుల తేడాతో గెలుపొందారు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అజాజ్‌ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్‌ (3/42), మాట్ హెన్రీ (1/10) దెబ్బకు భారత్ కుప్పకూలింది. అజాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత బ్యాటర్లలో రిషభ్‌ పంత్ (64) మినహా ఎవరూ రాణించలేదు. 
 
మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులు చేయగా.. భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 174 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అజాజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును విల్‌ యంగ్‌ సొంతం చేసుకున్నారు.
 
కాగా, న్యూజిలాండ్‌ జట్టు వరుసగా మూడు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్‌ను వైట్‌వాష్‌ చేసిన నాలుగో జట్టు కివీస్.. అంతకుముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ చేతిలో భారత్‌కు వైట్‌వాష్‌ తప్పలేదు.
 
అత్యల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ కాపాడుకోవడం ఇది రెండోసారి. ఇప్పుడు 147 పరుగుల టార్గెట్‌ను భారత్‌ ఛేదించలేకపోయింది. అంతకుముందు ఇంగ్లండ్‌పై (1978) 137 పరుగులను కివీస్‌ కాపాడుకుంది. ఓ టెస్టులో 200 కంటే తక్కువ టార్గెట్‌ను ఛేదించడంలో భారత్‌ విఫలం కావడం ఇది నాలుగోసారి. 1997లో విండీస్‌పై 120 పరుగులను కూడా ఛేదించలేకపోయింది. 
 
ఒకే టెస్టులో ఇద్దరు బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదేసి వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. భారత బౌలర్‌ రవీంద్ర జడేజా, కివీస్‌ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ ప్రదర్శన చేశారు. స్వదేశంలో వైట్‌వాష్‌ అయిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ. అంతకుముందు గుండప్ప విశ్వనాథ్ (1980), సచిన్ తెందూల్కర్ (2000) కెప్టెన్లుగా సిరీస్‌లను కోల్పోయారు.