గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (15:32 IST)

కాన్పూర్ టెస్ట్ : భారత్ ఘన విజయం - 2-0 తేడాతో సిరీస్ కైవసం

testmatch
కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పర్యాటక బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు రోజులపాటు ఆటనే సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం ఊహించడం కష్టమే. కానీ, భారత్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈక్రమంలో మరో హాఫ్ సెంచరీని యశస్వి తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మూడు పరుగులు అవసరమనగా, యశస్వి జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌తో (4 నాటౌట్) కలిసి కోహ్లీ మరో వికెట్‌ పడనీయకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
 
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్‌ గెలిచినట్లు అయింది. 
 
యశస్వి జైస్వాల్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువగా.. రవిచంద్రన్ అశ్విన్‌ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రాబోయే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు గెలిచినా భారత్‌ టాప్‌-2లో ఉండి ఫైనల్‌కు చేరడం ఖాయం.