కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లిని కర్కశంగా కొట్టి చంపేశాడు. కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని ఆ కిరాతక కానిస్టేబుల్.. కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ రోసీ నగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన శంకర్... బుధవారం రాత్రి తన తల్లి వసంతము (63)ను మద్యానికి డబ్బులు అడగగా, ఆమె లేదు అనడంతో ఆమెను శంకర్ కాలితో బలంగా తన్నాడు. ఆపై ఆమెను విచక్షణారహితంగా పిడుగుద్దులతో చితకబాదాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంతమ్మ అస్వస్థతకు గురికావడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తన స్వగృహానికి తీసుకురాగా మృతి చెందింది. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నెట్టి కంటయ్య వెల్లడించారు.