శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:54 IST)

సైబర్ కి'లేడి' .. పెళ్లి పేరుతో టెక్కీని నిండా ముంచింది...

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు హెచ్చుమీరిపోతున్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడేవారిలో యువతులు కూడా ఉన్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ యువతి ఏకంగా రూ.95 లక్షలను దోచుకుంది. ఇది సికింద్రాబాద్ నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫేస్‌బుక్‌ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి మిత్ర విజ్ఞప్తి (ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది. 
 
ఆ తర్వాత వారిద్దరి మధ్య కొంతకాలం పాటు స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో మనసులు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగినా బాధితుడు ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూడలేదు. 
 
మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌ ఖాతా డిలీట్‌ అయింది. ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.