1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (11:32 IST)

వాట్సాప్ నెంబర్లకు అలాంటి లింక్స్ వస్తే జాగ్రత్త... వామ్మో హ్యాకర్స్!

ప్రముఖ సంస్థ ఎండీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి సంస్థ ఉద్యోగుల వాట్సాప్‌ నెంబర్లకు ఒక మెసేజ్‌ వచ్చింది. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, ఎంతుంటే అంత వెంటనే తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అందులో సారాంశం. అది నమ్మశక్యంగా లేదని కొందరు ఉద్యోగులు విషయాన్ని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. తాను ఆ మెసేజ్‌లు పంపలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరా తీయగా ఎండీ వాట్సాప్‌ అకౌంట్‌ను కేటుగాళ్లు హ్యాక్‌ చేసినట్లుగా స్పష్టమైంది. వెంటనే వారు సిటీ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
బుధవారం మరో రెండు ఫిర్యాదులు ఇలాంటివే పోలీసులకు అందాయి. షేక్‌పేట్‌కు చెందిన యువతి సోదరుడు సౌదీలో ఉంటున్నాడు. అతడి వాట్సాప్‌ నుంచి ఆమెకు రెండు రోజుల క్రితం మెసేజ్‌ వచ్చింది. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, అకౌంట్‌ నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరడంతో, ఆమె వెంటనే రూ.1.50 లక్షలు పంపింది. 
 
అనంతరం సోదరుడికి ఫోన్‌ చేసి డబ్బులు వచ్చాయా అని అడగడంతో, ఆ మెసేజ్‌ అతడు పంపలేదని తేలింది. దీంతో ఆమె మెసేజ్‌ను స్ర్కీన్‌షాట్‌ తీసి సోదరుడికి పంపించింది. దీనిపై వారు మరింత లోతుగా పరిశీలించగా అతడి నెంబర్‌ హ్యాక్‌ అయిందని గుర్తించారు. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ కూడా తమది కాదని తెలిసింది.
 
ఇదే తరహాలో తన స్నేహితుడి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ రావడంతో రూ.లక్షన్నర ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు మారేడుపల్లికి చెందిన మరో యువకుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక లింక్‌ ద్వారా వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేస్తున్న కేటుగాళ్లు డబ్బులు కావాలంటూ ఆ అకౌంట్‌లో ఉన్న కాంటాక్ట్‌ నెంబర్లకు మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నారని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపారు.