ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (09:45 IST)

మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్‌పై వింగ్ కమాండర్ లైంగిక దాడి

crime
భారత వైమానిక దళంలో పని చేసే ఓ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ తన సీనియర్ అధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. పదేపదే ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని, పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ దారుణానికి పాల్పడింది సీనియర్ వింగ్ కమాండర్ అని, ఆయనకు ఇతర సీనియర్ అధికారులు కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారుూ. ఈ అంశంపై ఆమె జమ్మూ కాశ్మీర్‌లోని బుద్దామ్ పోలీస్ స్టేషనులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు ఇద్దరూ శ్రీనగరులో విధుల్లో ఉన్నారని, కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నట్టు ఐఏఎఫ్ తెలిపింది.
 
'ఈ కేసు గురించి మాకు తెలుసు. ఈ కేసు విషయమై స్థానిక పోలీస్ స్టేషను అధికారులు శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని సంప్రదించారు. స్థానిక అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం' అని ఐఏఎఫ్ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. కాగా గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ తనను లైంగిక వేధింపులు, లైంగిక దాడి, మానసిక హింసకు గురిచేశాడని ఫ్లయింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
'డిసెంబర్ 31, 2023న ఆఫీసర్స్ మెస్ న్యూ ఇయర్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో నాకు బహుమతి వచ్చిందా? అని వింగ్ కమాండర్ అడిగారు. రాలేదని నేను చెప్పాను. బహుమతి నా గదిలో ఉందంటూ ఆయన నన్ను గదికి తీసుకెళ్లారు. మీ కుటుంబం ఎక్కడ ఉందని అడిగితే... వేరే చోట ఉందని ఆయన చెప్పారు. ఇక, గదిలో ఎవరూ లేకపోవడంతో ఓరల్ సెక్స్ చేయాలంటూ నన్ను బలవంతం చేశారు. ఇలాంటి పనులు వద్దని పదే పదే ప్రాధేయపడ్డాను. అన్ని విధాలుగా ప్రతిఘటించడానికి ప్రయత్నించాను. చివరకు అతడిని తోసివేసి అక్కడి నుంచి పారిపోయాను' అని ఫ్లయింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
జరిగిన విషయం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని, గతంలోనే ఫిర్యాదులు చేసినా నిరుత్సాహ పరిచే సందర్భాలు ఎదురవడంతో ఏం చేయాలో తోచలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆ అధికారి తన కార్యాలయానికి వచ్చారని, ఏమీ జరగనట్లుగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. అతడిలో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని పేర్కొన్నారు. ఓ ఇద్దరు మహిళా అధికారులను సంప్రదించానని, ఫిర్యాదు చేసే విషయంలో వారు మార్గనిర్దేశం చేయడంతో కేసు పెట్టానని ఆమె చెప్పారు. తనకు ఎదురైన మానసిక వేదనను వర్ణించలేనని ఆమె పేర్కొన్నారు.