అన్నను చంపిన వదినను మట్టుబెట్టిన మరిది.. ఎక్కడ?
దురలవాట్లకు బానిసైన కట్టుకున్న భర్తను భార్యం చంపేసింది. దీన్ని జీర్ణించుకోలేని మృతుడి సోదరుడు అంటే ఆమె మరిది.. కక్షతో వదినను హతమార్చాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని విశ్వకర్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
కుత్బుల్లాపూర్ మండలం సూరారం విశ్వకర్మకాలనీకి చెందిన సురేశ్, రేణుక అలియాస్ ధరణి (24) గత 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేష్ ఆటోడ్రైవర్. వీరికిద్దరు కుమార్తెలు. రేణుక నిత్యం కల్లు దుకాణాలకు వెళ్లేది. అలా దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలిక పరిచయమవడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. కొంతకాలానికి భర్తకు, ఆ బాలికకు రహస్యంగా పెళ్లి చేసింది.
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఫిబ్రవరి 5న భర్త మద్యం మత్తులో నిద్రపోతుండగా ఆ బాలికతో కలిసి చంపేసింది. భర్తను ఎవరో చంపారని నమ్మించినా చివరకు హంతకురాలు ఆమేనని తేలడంతో జైలుకెళ్లింది. రేణుక బెయిలుపై బయటకొచ్చిన విషయం తెలుసుకున్న మరిది నరేశ్ (26) ఆమెకు మంగళవారం రాత్రి ఫోన్ చేసి తనకు రూ.200 కావాలని అడిగాడు.
ఎందుకని అడిగితే మద్యం కోసమని చెప్పడంతో తానూ తాగుతానంటూ నరేశ్ ఇంటికెళ్లింది. అప్పటికే అక్కడ సాయి(19), పద్మ(30), మరో బాలుడు (17) ఉన్నారు. నలుగురూ మద్యం తాగారు. రేణుక మత్తులో ఉండగా నలుగురూ కలిసి మెడకు చున్నీ బిగించి చంపేశారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఆమె చివరగా మరింది నరేశ్‌తో మాట్లాడినట్టు ఉంది. దీంతో నరేశ్‌తో పాటు అతనికి సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.