శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (09:13 IST)

పెళ్లికి అంగీకరించని ప్రియురాలు - గొంతు కోసిన ప్రియుడు

knife
కొన్నేళ్లుగా గాఢంగా ప్రేమిస్తూ వచ్చిన యువతి ఒక్కసారిగా పెళ్లికి నిరాకరించడంతో ఆ ప్రేమికుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో పట్టరాని కోపంతో తన ప్రియురాలి గొంతు కోసేశాడు. ఈ దారుణ ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని కడిపికొండ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 26 యేళ్ళ అవివాహితను గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, వీరిద్దరిదీ వేర్వేరు మతాలు కావడంతో వారివారి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తమ పెళ్ళికి మతం అడ్డం రాకూడదని భావించిన యువకుడు ఆమె మతాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ ఆ యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరి గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గత రాత్రి యువతి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. మరోమారు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పెళ్లి చేసుకుందామని వేడుకున్నాడు. అందుకు ఆ యువతి ఏమాత్రం కనికరించలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. చేతిపై గాయం చేశాడు. వెంటనే అప్రమత్తమైన యువతి కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. మడికొండ ఖాకీలకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.