మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (14:54 IST)

సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తారు : బీజేపీ ఎంపీ జీవీఎల్

gvl narasimha rao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్.నరసింహా రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పేరుతో ఆయన ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాలో అడుగుపెడతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర నుంచి ఆంధ్రలను తరిమి కొడతామన్న కేసీఆర్ ఇపుడు ఏపీ ప్రజలతో అవసరం వచ్చిందా అని నిలదీశారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రజలకు తక్షణం సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించడంపై జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, ఆంధ్రకు కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేరన్నారు. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు వద్దన్న కేసీఆర్‌కు ఇపుడు ఏపీలో ఏం పని అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్.. ఏపీలో అధికారంలోకి వస్తే పోలవరంను పూర్తి చేస్తామని చెప్పడం ఆయన సిగ్గులేని తనానికి నిదర్శనమన్నారు. 
 
విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం ప్రాజెక్టులోని నీళ్లను సముద్రంపాలు చేసిన వ్యక్తి కేసీఆర్ ఆయన గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తి ఇపుడు ఆంధ్రను ఉద్ధరించేందుకు వస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చర్యలను కేసీఆర్ ప్రారంభించి, ఏపీలో శాఖను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు.