గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెరాసలో ఉన్నవారంతా తాలిబన్ తీవ్రవాదులే : వైఎస్ షర్మిల

ys sharmila
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నవారంతా తాలిబన్ తీవ్రవాదులతో సమానమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఆరోపించారు. తాను చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకే తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. 
 
గురువారం రాజ్‌భవన్‌‍లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో ఆమె సమావేమయ్యారు. గవర్నర్‌తో భేటీ తర్వాత ఆమె మాట్లాడుతూ, తెలంగాణాలో తన పాదయాత్రను తెరాస, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో తన వాహనంపై దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. 
 
ఆ ధ్వంసం చేసిన వాహనంతోనే ప్రగతి భవన్‌లో వెళుతుండగా పోలీసులు తనను అరెస్టు చేశారని ఆమె చెప్పారు. గవర్నర్‌తో భేటీ సందర్భంగా అన్ని విషయాలు చెప్పినట్టు షర్మిల తెలిపారు. అదేసమయంలో ఆమె సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మార్చివేస్తున్నారంటూ ఆరోపించారు. తాలిబన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెరాస పార్టీలో ఉన్న వాళ్ళంతా తాలిబన్లతో సమానమని ఆమె మండిపడ్డారు. 
 
కేవలం ట్రాఫిక్ జామ్ అయిన కేసులో తనను పోలీసులు అరెస్టు చేశారని, ఒక మహిళ అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్‌లో విచారించడంతో పాటు తన వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించారు.