శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (18:24 IST)

టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు

murder
గత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన టెక్కీ ప్రభా అరుణ్ కుమార్(41) హత్య కేసులో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5.75 కోట్ల రివార్డు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బెంగుళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్‌ను గత 2015 మార్చి 7వ తేదీన గొంతులో కత్తితో పొడిచి దండగులు హత్య చేశారు. హత్య జరిగి సుమారుగా పదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు హంతకుడి ఆచూకీని గుర్తించలేకపోతున్నారు. దీంతో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్ల అంటే మన దేశ కరెన్సీలో రూ.5.75 కోట్లు ఇస్తామని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది. 
 
బెంగుళూరులోని మైండ్ ట్రీ కంపెనీలో పనిచేస్తూ వచ్చిన ప్రభ విధి నిర్వహణలో భాగంగా సిడ్నీకి వెళ్ళారు. అక్కడ విధులు ముగించుకుని బెంగుళూరులో ఉన్న తన భర్తతో ఫోనులో మాట్లాడుతూ, ఇంటికి నడిచి వస్తున్న సమయంలో ఆమె ఉండే ఇంటికి 300 మీటర్ల దూరంలో హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారు. ఎందుకు హత్య చేశారన్న విషయాన్ని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు హంతకుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది.