మంగళవారం, 1 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (09:33 IST)

మియాపూర్‌లో దారుణం.. ఇంటిలోనే మహిళా టెక్కీ హత్య

murder
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళా టెక్కీ ఆమె ఉండే ఇంటిలోనే దారుణ హత్యకు గురైంది. తల్లి తాను పని చేస్తున్న పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఈ ఘోరం బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
మియాపూర్ ఏసీపీ నరసింహారావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ 3ఏ బ్లాక్‌లో బండి స్పందన (29) అనే టెక్కీ తన తల్లి నమ్రతతో కలిసి ఉంటుంది. తల్లి స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో పని చేస్తుంది. సోమవారం తల్లి నమ్రత తాను పని చేస్తున్న పాఠశాలకు వెళ్లగా, స్పందన మాత్రం ఒక్కటే ఇంట్లో ఉన్నది. 
 
మధ్యాహ్నం సమయంలో స్పందన సోదరి వచ్చి ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో వెళ్లిపోయింది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ నొక్కినా, కుమార్తె సెల్ఫోన్‌కు కాల్ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే హత్యకు గురైఉంది. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచినట్లు కనిపిస్తున్నా.. అక్కడ ఎటువంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితులు తెలిసినవారా అనే కోణంలో విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. అపార్టుమెంట్‌తో పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీని సేకరిస్తున్నామన్నారు.
 
కాగా, స్పందనకు గత 2022లో అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. కానీ, యేడాది తర్వాత అంటే 2023లో తన భర్త వేధిస్తున్నాడంటూ స్పందన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదేసమయంలో వీరి విడాకుల కేసు కూడా కోర్టులో విచారణలో ఉంది. ఈ పరిస్థితుల్లో స్పందన దారుణ హత్యకు గురికావడం వెనుక భర్త హస్తం ఉండివుండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.