18 మెట్లు ఎక్కలేదు.. ఇరుముడి లేనేలేదు.. అది నిజంగా అయ్యప్ప సన్నిధానమా?
కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇద్దరు మహిళల ప్రవేశాన్ని తప్పుబడుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నల్లటి దుస్తులు ధరించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారే కానీ.. వారి అయ్యప్ప స్వామి యాత్ర సంపూర్ణం కాలేదని వార్తలు వస్తున్నాయి.
అయ్యప్పను దర్శించుకున్న ఆ ఇద్దరు మహిళలు 18 మెట్లు ఎక్కలేదు. ఇరుముడిని తలపై ధరించలేదు. అయ్యప్ప దర్శనం జరగాలంటే ఇరుముడి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అలాగే 18 పడి మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధికి చేరుకుంటేనే శబరిమల యాత్ర పూర్తవుతుంది. అలాంటిది పడి మెట్లు ఎక్కకుండా పక్కనుంచి ఆలయంలోకి వెళ్లినట్లుగా అర్థమవుతుంది. అందుచేత ఆ ఇద్దరి మహిళల అయ్యప్ప దర్శనం సంపూర్ణం కాలేదు.
మహిళల దర్శనానికి అనంతరం సంప్రోక్షణ చేసి.. ఆలయాన్ని తెరవడం ద్వారా భక్తుల ఆందోళనలు అవసరం లేదని.. పండితులు అంటున్నారు. అంతేగాకుండా శబరిమలకు చేరుకున్న ఇద్దరు మహిళలు లోపలికి వెళుతున్నట్లుగా ఉన్నది అసలు సన్నిధానం కాదని కొందరు వాదిస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ 28న 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లొచ్చంటూ తీర్పునిచ్చింది. ఆ క్రమంలో ఎంతోమంది మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు అడుగడుగునా అడ్డుకున్నారు. శబరిమల పరిసరాల్లోకి రాకుండా నియంత్రించారు.
ఇలా చాలా సందర్భాల్లో అయ్యప్ప దర్శనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ బుధవారం ఉదయం శబరిమల అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారని వీడియోలు రావడం.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించడం ప్రస్తుతం ఆందోళనకు దారితీసింది.