సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 7 నవంబరు 2018 (16:23 IST)

కార్తీక మాసం ప్రారంభమవుతోంది... ఈ మాసంలో అలా చేస్తే చాలు...

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి ఈ మాసంలోనే వస్తాయి.
 
శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 
 
ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు తెల్లవారుజామునే లేచి పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. 
 
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు చెబుతున్నాయి. కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.