సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 8 సెప్టెంబరు 2018 (17:49 IST)

సోమవారంనాడు ఉమామహేశ్వరులను ఇలా పూజిస్తే...

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. పార్వతీపరమేశ్వరులను మనం సమస్త లోకాలకు ఆదిదంపతులుగా భావించి పూజలు నిర్వహిస్తాము. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ  కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. పార్వతీపరమేశ్వరులను మనం సమస్త లోకాలకు ఆదిదంపతులుగా భావించి పూజలు నిర్వహిస్తాము. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.
 
1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి.
 
2. పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్దికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.
 
3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
 
4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. 
 
5. పరమశివుని గుడికి వెళ్లినప్పుడు శివుణ్ణి దర్శించుకున్న తరువాత నందీశ్వరుని కుడి చెవిలో మన కోరికలను కనుక చెప్పుకుంటే అది నేరుగా సాక్షాత్తు పరమశివునికి చెప్పినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అలా చెప్పడం వల్ల మన కోరికలు తీరడమే కాకుండా స్వామి వారి చల్లని చూపు ఎల్లప్పుడు మన మీదే ఉంటుంది.