బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది.. రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందారనే వార్తలు తరచుగా వింటుంటాం. మరికొందరికి కాళ్లూచేతులు చచ్చుబడి పోవడం (పక్షవాతం), మరికొందరు మాట్లాడలేక పోవడం జరుగుతుంది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను సంప్రదిస్తే...
బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం. ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తీసుకువెళితే క్లాట్ బర్స్టింగ్ థెరపీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాట పడిపోకుండా కాపాడవచ్చు. ఈ స్ట్రోక్‌కు గురైన వారిని ఆస్పత్రిలో చేర్చడం ఆలస్యమయ్యే కొద్దీ ప్రాణాపాయం ఉంటుంది.
బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడానికి ప్రతి ఒక్కరిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు బయటపడతాయి. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ముఖం బలహీనం కావడం, మూతి వంకరపోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ హెచ్చరికలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. రక్తపోటు, మధమేహం వంటివి ఉంటే వీటిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.