కళ్ళు ఆరోగ్యంగా ఉండాలా? జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు..!
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కళ్ళు చాలా ముఖ్యమైన అవయవం. అందుకే కళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను అలవాటుచేసుకోవాలి. బయటదొరికే జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ లాంటివి శరీరారోగ్యాన్నే కాదు కంటి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతాయి.
పోషక పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటిచూపు దెబ్బతినదు. కొంతమంది అదేపనిగా పుస్తకాలను కళ్లార్పకుండా చదువుతుంటారు. ఇది కళ్లకు ఏమాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పుస్తక పఠనం చేసేటప్పుడు అప్పుడప్పుడు కళ్లను పైకి కిందకు తిప్పుతుండాలి. ఇలా చేయడం వల్ల కంటికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది.
డీహైడ్రేషన్ వల్ల కూడా కళ్లు పొడిబారి పోతుంటాయి. అందుకే మంచినీళ్లను బాగా తాగాలి. రోజూ కేరట్ జ్యూసు తాగితే కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పుదీనా, కొత్తిమీర రసం కూడా కంటికి మేలు చేస్తుంది. నల్ల ద్రాక్ష, ఎర్రద్రాక్ష, బెర్రీస్ పళ్లు తింటే కూడా కళ్లకు ఎంతో ఆరోగ్యం. దానిమ్మ, బొప్పాయి కూడా కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే కెఫీనేటెడ్ డ్రింకులకు, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింకులకు దూరంగా ఉండాలి.