పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...
పాకిస్థాన్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోమారు దేశంలో ఉగ్రవాద దాడి జరిగితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళల నుదుట సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో ధీటుగా బదులిచ్చామన్నారు. భారత్‌పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని, మని దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు.
ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. మోడీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించారని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మన రక్షణ దళాలు.. ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు.. దేశమంతా గర్విస్తోందన్నారు. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం దేశ భక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. మనం ఎపుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతామన్నారు.