ఖర్జూరంలో ఎన్నో పోషక పదార్థాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఖర్జూర పండ్లలో గ్లూకోజ్, ప్రక్టోజ్ వంటి ప్రకృతి సిద్ధమైన చక్కర పదార్థాలు ఉండి శరీరంలో వెంటనే కలిసిపోయి కావాల్సిన శక్తిని ఇస్తాయి. కొవ్వు శాతం తక్కువగా వుండి కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు 1.2శాతం, కొవ్వు పదార్థం 0.4శాతం, కార్బోహైడ్రెట్స్ 33.8 శాతం, ఎంజైమ్స్ 3.7శాతం, మినరల్స్ 1.7 శాతం, కాల్షియం 0.022శాతం, పాస్పరస్ 0.38శాతం. చెక్కర 85శాతం తోపాటు విటమిన్ బీ, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. దీనిలో పోషకపదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.
శరీరంలోని వేడిని తగ్గించడం, కళ్లుతిరగడం, జ్వరం, పంటినొప్పులు, కాలేయ, గుండె సంబంధిత వ్యాధుల నివారణలో ఖర్జూరం ప్రముఖపాత్ర పోషిస్తుంది. నరాల బలహీనతను తగ్గించడం, నరాలలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేవిధంగా దోహదపడుతుంది. ఆస్తమా, ఎక్కిళ్లు, ఒంటినొప్పులు, డయేరియా, దగ్గు వంటివి తగ్గించడంలో ఖర్జూరంతో తయారుచేసిన సిరప్‌లు ఉపయోగపడుతాయి.వ్యాధి నిరోధ కశక్తిని పెంచి సర్వరోగనివారిణిలా ఖర్జూరం పని చేస్తుందంటే అతిశయోక్తికాదు.
వారానికి మూడుసార్లు ఖర్జూరాలను తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఖర్జూరాల్లోని నికోటిన్ పేగుకు సంబంధించిన వ్యాధుల్ని రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా పెరిగేలానూ చేస్తాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు జీర్ణక్రియకూ దోహదపడతాయి. ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, రక్తహీనతనీ నివారిస్తాయి. తద్వారా అలసటనీ నీరసాన్నీ తగ్గిస్తాయి.
ఖర్జూరాల్లో సల్ఫర్ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలూ, సైనస్‌లతో బాధపడేవాళ్లకి ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఖర్జూరాల్లో చక్కెరలూ, ప్రొటీన్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండటంవల్ల బరువు తక్కువగా ఉండేవాళ్లకు పుష్ఠినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి సుమారుగా 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి.
ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరుని ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకే వయసురీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి మంచి ఆహారం. గుండె పనితీరునీ మెరుగుపరుస్తాయివి. ముఖ్యంగా గుండె బలహీనంగా ఉన్నవాళ్లు రాత్రిపూట ఎండుఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా చేసుకుని తినడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగాలు రాకుండా చేస్తాయి.
ఖర్జూరాలు లైంగికశక్తికీ తోడ్పడతాయి. రాత్రికి మేక పాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు.
దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడేవాళ్లు ఖర్జూరపండ్లు తింటే, వాటిల్లోని పొటాషియంవల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
దంతాలమీద ఉండే ఎనామిల్ పూతను సంరక్షించడంలో ఖర్జూరాల్ని మించినవి లేవు. నిజానికి ఈ ఎనామిల్ ఎముకకన్నా దృఢమైన హైడ్రాక్సీఎపటైట్స్ అనే పదార్థాలతో రూపొందుతుంది. అయినప్పటికీ ఆహారంలోని బ్యాక్టీరియా కారణంగా అది కొంచెంకొంచెంగా పోతుంటుంది. అదే ఖర్జూరాల్ని ప్రతిరోజూ తినడంవల్ల అందులోని ఫ్లోరిన్ దంతాలమీద పాచి చేరకుండా చూడటంతోబాటు ఎనామిల్‌తో చర్యపొంది హైడ్రాక్సీఫ్లోరోఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
రోజుకో ఖర్జూరం తినడం కళ్లకీ మంచిదే. ఇందులో పుష్కలంగా ఉండే ఎ-విటమిన్ రేచీకటినీ నివారిస్తుంది. గర్భిణుల ఆరోగ్యానికి ఎడారిఫలాలు ఎంతో మేలు. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతోబాటు, బిడ్డపుట్టాక పాలు పడేందుకూ కారణమవుతాయి. గర్భస్థశిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకూ సాయపడతాయి. వీటిల్లో ఉండే ఫ్లేవొనాయిడ్ పాలీఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లూ పొట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.
ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, ఇందులో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.