బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?
బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయనీ అందరికీ తెలుసు. అయితే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయట.
బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయనీ అందరికీ తెలుసు. అయితే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయట. ఎందుకంటే బాదం తొక్కలో ఉండే టానిన్లు అందులోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అదే నానబెట్టి ఆ తొక్కను తీసేసి తినడంవల్ల అందులోని పోషకాలన్నీ పూర్తిగా ఒంటపడతాయి. అందుకే బాదంపప్పుల్ని కనీసం 8 గంటలైనా నానబెట్టి ఆరగిస్తే ఎంతో ఉత్తమం అంటారు.
నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వల్ల కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.
వీటిల్లోని మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్టనిండిన అనుభూతిని కలిగిస్తాయి. దాంతో బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృదయపనితీరుకీ సాయపడతాయి.
వీటిల్లోని విటమిన్-ఈ ఫ్రీరాడికల్స్ నుంచి చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.
నానబెట్టిన బాదంలో విటమిన్ బి17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. ఫోలిక్‌ఆమ్లం పుట్టబోయే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.